- కె. శ్రీనివాసాచారి
ప్రకృతిలో నియమబద్ధత ఉన్నది. ఆ నియమబద్దతే (Law-governed order) జీవుల్లో హేతుబద్ధత (Rationality) గా పొడచూపింది. మనుషుల్లో అదే హేతుబద్ధత ఉన్నత స్థాయిలో ప్రకటితమవుతోంది. ఎందుకంటే జీవులు, మనుషులు ప్రకృతిలో అవిభాజ్యమైన భాగాలు. ప్రకృతిలో ఉన్న నియమబద్ధతను హేతుబద్ధతతో క్రమబద్దంగా తెలుసుకోవడం వల్ల విజ్ఞానం (Science) ఏర్పడుతున్నది. విస్తరిస్తున్న విశ్వాన్ని అధ్యయనం చేసుకుంటూ వెళుతున్న మేరకు మానవ విజ్ఞానం విస్తరిస్తూనే ఉన్నది. విజ్ఞాన విస్తరణ జరుగుతున్న మేరకు మానవ అభ్యుదయం సాధ్యమవుతూ ఉన్నది.
మానవ ఆలోచన ఎప్పుడు ప్రారంభమైందో ఇదమిద్దంగా నిర్ణయించడం ప్రస్తుతం సాధ్యం కాకపోయినప్పటికీ మనిషి అంత ప్రాచీనం అని మాత్రం చెప్పవచ్చు. "హోమో సేపియన్స్ సేపియన్స్" మూడు లక్షల సంవత్సరాల క్రితం ఆవిర్భవించినట్టు ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే ఈ భూమి మీద 'మానవ ఆలోచన' వయస్సు కూడా మూడు లక్షల సంవత్సరాలనే అర్థం. భూమి వయసుతో పోలిస్తే ఈ వయస్సు చాలా చిన్నది. ఈ అనతికాల ఆలోచనల సంచిత జ్ఞానమే (Cumulative Knowledge) ఆధునిక విజ్ఞానం (Modern Science)గా చెప్పవచ్చు.
మానవుడు ప్రకృతిలో జరుగుతున్న అనేక సంఘటనలను నిరంతరం పరిశీలించిన కారణంగానే ప్రకృతిలో అంతర్గతంగా నియమబద్ధత ఉందని గుర్తించాడు. దాని ఆధారంగానే పునరావృతమయ్యే సంఘటనలు ఏమిటో, ఎంత కాలానికి అవి పునరావృతం అవుతున్నాయో గుర్తుంచుకుంటూ, తర్వాతి తరాల వారికి ఆ సమాచారాన్ని అందిస్తూ జ్ఞానాన్ని సముపార్జించుకున్నాడు. ఇదంతా ప్రకృతికి సంబంధించిన జ్ఞానమే. సరళమైన విషయాల నుండి సంక్లిష్టమైన విషయాల వైపు మానవుడి జ్ఞాన సముపార్జన ప్రయాణం మళ్లింది.
మొదట్లో మనిషి చేసినదంతా మూర్త ఆలోచనే (Concrete Thinking), అంటే తన ముందు ఉన్న విషయాలు, భౌతికంగా కంటికి కనిపించే విషయాల గురించే ఆలోచించాడు. అంటే ప్రకృతిలో ఉన్న విషయాలు, జరుగుతున్న సంఘటనల మధ్య కార్యకారణ సంబంధాన్ని (Relationship of Cause and Effect) అర్థం చేసుకుంటూ తదనుగుణంగా తన మనుగడను సాగించాడు. కానీ, అంతటితో ఆ ఆలోచన ధార ఆగిపోలేదు.
మానవుడి ఆలోచన - మూర్త ఆలోచన నుండి అమూర్త ఆలోచన (Abstract Thinking) కు మరలింది. అంటే తన కంటి ముందు ఉన్న విషయాలను మాత్రమే కాకుండా గతంలో తాను చూసిన, అనుభవించిన విషయాలను మళ్లీ గుర్తుకు తెచ్చుకొని దాని గురించి ఆలోచించడం, భౌతికంగా లేని విషయాలు, భావనల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. తద్వారా సృజనాత్మకత (Creativity) సాధ్యమయ్యింది. దాని ఫలితమే ఆధునిక విజ్ఞానం. మనిషి ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు అతడు సాధించిన గొప్ప విజయం ఏదైనా ఉందంటే అది ఆధునిక విజ్ఞానమే (Modern Science).
ఆధునిక విజ్ఞానం అనేది మానవ అన్వేషణ, పరిశీలన, పరిశోధనల, ఆవిష్కరణల ఫలితమే. శాస్త్రవేత్తల నిత్య పరిశీలన, కృషి, సాంకేతికత ఆధారంగా కొత్త జ్ఞానం వెలువడుతుంది. పాత సిద్ధాంతాలను పరీక్షించి, తప్పులను సరిదిద్దడం విజ్ఞాన విస్తరణకు మూలాధారం. విజ్ఞానానికి పరిధులు లేవు, పరిమితులు లేవు. ప్రతి సమాధానం కొత్త ప్రశ్నను తీసుకొస్తుంది. ఆధునిక విజ్ఞానం మనుషుల ఆలోచనా పరిధిని విస్తరింపజేస్తూనే ఉంటుంది.
మానవ నాగరికతను పరిశీలిస్తే మానవ నిరంతర జ్ఞాన యాత్రను చూపిస్తుంది. అది వైజ్ఞానిక యాత్రే. ఈ యాత్రలో మనిషి నిరంతరం ప్రశ్నించాడు, వెతికాడు, పరిశోధించాడు. ఈ నిరంతర ప్రయత్నాలే విజ్ఞాన శాస్త్రానికి (Science) మూల కారణాలు. విజ్ఞానం అంటే కేవలం సాంకేతిక పరికరాలు, ఆవిష్కరణలు మాత్రమే కాదు; అది మనిషి ఉన్నతమైన జిజ్ఞాసకు, సందేహాలకు, అన్వేషణా తపనకు ప్రతిరూపం. వైజ్ఞానిక యాత్ర కేవలం గతంతో పరిమితం కాలేదు; ప్రతి కొత్త ఆవిష్కరణ, ప్రతి కొత్త సిద్ధాంతం, ప్రతి కొత్త ఆలోచన జ్ఞానాన్ని విస్తరిస్తూ మానవ జీవనాన్ని కొత్త గమ్యాలవైపు నడిపించింది.
మానవుడు తన అనుభవాలతో, పరిశీలనలతో, ప్రశ్నలతో, ప్రయోగాలతో నిరంతరం జ్ఞానాన్ని సేకరించుకుంటూ వస్తున్నాడు. ఈ ప్రక్రియలో విశాస్త్రజ్ఞానం విస్తరించి, కొత్త కొత్త రంగాల్లోకి వ్యాపించింది. ముఖ్యంగా...
1. ప్రకృతి రహస్యాల వెలికితీత: మొదట మనిషి భూమి, నీరు, నక్షత్రాలు, అంతరిక్షం వంటి ప్రకృతి అంశాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. "ఎందుకు వర్షం పడుతుంది?", "సూర్యుడు ఎలా ఉదయిస్తాడు?", "మొక్కలు ఎలా పెరుగుతాయి?" వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ విజ్ఞానానికి పునాది వేసాడు. విజ్ఞానం యొక్క మూలం – సందేహం (Doubt). తాత్విక దృష్టిలో విజ్ఞానం ఆరంభం "సందేహం" తోనే జరిగింది. సోక్రటీస్ అన్నట్లు: "అన్వేషణ లేకపోయిన జీవితం జీవితమే కాదు." మనిషి “ఎందుకు?” అని ప్రశ్నించిన క్రమంలో విజ్ఞానం పుట్టింది. ప్రశ్నలతో ప్రారంభమైన ఈ అన్వేషణ, కాలక్రమేణా గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, రసాయనశాస్త్రం, సామాజిక శాస్త్రాలుగా విస్తరించింది. సందేహం నుంచి సత్యాన్వేషణ, సత్యాన్వేషణ నుంచి విజ్ఞాన శాస్త్రం పుట్టింది.
2. మానవ చరిత్రలో విజ్ఞాన విప్లవాత్మక దశలు: విజ్ఞానం విస్తరించిన దశలు మానవ చరిత్రలో మహత్తరమైన విప్లవాలుగా నిలిచాయి.
A. అగ్ని ఆవిష్కరణ జీవన రక్షణకు, ఆహార వంట మొదలైన మార్పులను తీసుకువచ్చింది.
B. చక్రం ఆవిష్కరణ రవాణా, వాణిజ్య రంగాల్లో విప్లవాత్మక మార్పుకు కారణమయ్యింది.
C. విద్యుత్ ఆవిష్కరణ – పరిశ్రమలు, కమ్యూనికేషన్, కాంతి, వైద్యాలనే కాదు విద్యుత్ నేరుగా ప్రభావితం చేయని రంగమే లేదు.
D. ముద్రణ యంత్రం జ్ఞాన విస్తరణ, పుస్తకాలు, విద్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.
E. ఆధునిక వైద్యం వ్యాక్సిన్లు, యాంటీబయాటిక్స్, శస్త్రచికిత్సల ద్వారా మనిషి జీవితకాల కొనసాగింపుకు తోడ్పడుతున్నాయి.
F. అంతరిక్ష విజ్ఞానం చంద్రయానం, మార్స్ మిషన్, విశ్వ రహస్యాల అన్వేషణను సులభతరం చేస్తుంది.
G. సమాచార, సాంకేతిక విప్లవం పేరుతో ఇంటర్నెట్, కంప్యూటర్లు, కృత్రిమ మేధస్సు (AI) మానవ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్తున్నాయి. ప్రతి దశలో విజ్ఞానం విస్తరించి, మానవ నాగరికతను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లింది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, ఆవిష్కరణల ద్వారా విజ్ఞానం మరింత విస్తరించింది. ఆవిష్కరణలతో జీవనం సురక్షితం అయ్యింది. జీవితం సులభం అయ్యింది. ఒక్క విద్యుత్ ఆవిష్కరణతో పరిశ్రమలు, కమ్యూనికేషన్, వైద్యం ఇతర అనేక రంగాలు విప్లవాత్మకంగా మారాయి.
3. శాస్త్రజ్ఞానం మరియు తాత్వికత: విజ్ఞానం విస్తరణను తాత్వికంగా చూడాలంటే మూడు ప్రధాన కోణాలు మనకు స్పష్టమవుతాయి:
A. విజ్ఞానం – వాస్తవాన్వేషణ:
తత్వశాస్త్రం "సత్యం ఏమిటి?" అని అడుగుతుంది. విజ్ఞానం "దాన్ని ఎలా నిర్ధారించాలి?" అని అడుగుతుంది. తత్వశాస్త్రం ప్రశ్నలకు పునాది అయితే, శాస్త్రం వాటికి పరిశీలనాత్మక సమాధానం.
B. విజ్ఞానం నిరంతర పరిణామం: ఒక సిద్ధాంతం శాశ్వతం కాదు. న్యూటన్ సిద్ధాంతం ఒక కాలానికి సరిపోతే, ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం మరింత లోతైన సత్యాన్ని వెలికితీసింది. విజ్ఞానం తుది పరిష్కారం మాత్రమే కాదు; అది నిరంతర విస్తరణ.
C. విజ్ఞానం ద్వారానే మానవ విముక్తి: శాస్త్రజ్ఞానం మనిషిని భయాల నుంచి విముక్తి చేసింది. ఒకప్పుడు పిడుగుపడితే దేవుడు కోపించాడు అని అనుకునేవాడు. ఇప్పుడు అది ప్రకృతి శక్తుల పరస్పర చర్య అని తెలుసుకున్నాడు. అందువల్ల మనిషికి అజ్ఞానం నుంచి విముక్తి జరిగింది. ఈ ఒక్క కారణంగా మనిషి మరణ భయాన్ని జయించగలిగాడు. శాస్త్రీయ జ్ఞానం వైద్య రంగంలో అద్భుతమైన విస్తరణ సాధించింది. వ్యాక్సిన్లు, యాంటీబయాటిక్స్ ఆవిష్కరణ వల్ల అనేక మహమ్మారులు నియంత్రణలోకి వచ్చాయి. శస్త్రచికిత్స, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్‌లు, స్టెమ్ సెల్ థెరపీ వంటి కొత్త చికిత్సా పద్ధతులు అభివృద్ధి చెందాయి.
4. మానవ సంక్షేమంలో విజ్ఞానం పాత్ర: విజ్ఞానం విస్తరణ వల్ల మానవ జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆరోగ్య రంగంలో రోగాల నివారణ, జీవన కాలం పెరుగుదల. ఆహార విషయంలో నూతన వ్యవసాయ పద్ధతులు, ఎరువులు, గ్రీన్ రివల్యూషన్ సంభవించాయి. రవాణా సౌకర్యాలైతే గణనీయంగా మారాయి. ఊరు దాటి వెళ్ళాలంటే ఇబ్బందులు పడ్డ మనుషులు సముద్రాలు సులభంగా దాటుతున్నారు. రైలులు, విమానాలు, రాకెట్లు దూరాన్ని, సమయాన్ని బాగా తగ్గించాయి. సమాచారమైతే ఇంటర్నెట్, మొబైల్, ఉపగ్రహ సాంకేతికత వల్ల అందరి అందికలోకి వచ్చింది. పెరిగిన సౌకర్యాలు, పరిశ్రమలు, విద్య కారణంగా జీవన ప్రమాణాలూ పెరిగాయి. ఈ మార్పులు కేవలం సాంకేతిక అభివృద్ధి కాదు; అవి మానవ మౌలిక అవసరాలకు సమాధానాలు.
5. అంతరిక్ష పరిశోధనలు:
మానవుడు చంద్రుడిపై అడుగుపెట్టడం, మార్స్ మిషన్లు పంపడం, టెలిస్కోప్ల ద్వారా విశ్వ రహస్యాలను తెలుసుకోవడం... ఈ పరిణామాలు శాస్త్రజ్ఞాన విస్తరణకు నిదర్శనాలు. సమాచార సాంకేతికతతో నేడు జ్ఞానం ఒక బటన్ నొక్కితే మన చేతుల్లోకి వచ్చేస్తుంది. శాస్త్రజ్ఞాన విస్తరణ వల్ల లాభాల వల్లే జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ఉత్పాదకత పెరిగింది. ప్రపంచం ఒక “గ్లోబల్ విలేజ్” గా మారింది.
6. విజ్ఞానం – సవాళ్లు మరియు దుష్ప్రభావాలు: విజ్ఞానం విస్తరణతో పాటు కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నమయ్యాయి.
A. అణు ఆయుధాలు, యుద్దాల వల్ల మానవ జాతి నాశనం అయ్యే ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని ప్రతీ క్షణం గుర్తుంచుకోవాలి.
B. గ్లోబల్ వార్మింగ్, వాయు కాలుష్యం, సమాచార కాలుష్యం వల్ల పర్యావరణ కాలుష్యం జరిగి మనిషి మానసిక సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నది.
C. సాంకేతిక అసమానతల వల్ల ధనిక దేశాలు మరింత ధనిక దేశాలుగా, పేద దేశాలు మరింత పేద దేశాలుగా మారి తేడాలు పెరుగుతున్నాయి.
D. సైబర్ నేరాలు నేడు సమస్యగా మారుతోంది. ఇంటర్నెట్ దుర్వినియోగం చేస్తూ అమానవీయ చర్యలు జరిగే అవకాశాలు మరింత పెరుగుతాయి.
E. మానవ విలువలు మర్చిపోవడం అనేది యంత్రాలపై ఆధారపడటం, అధిక సమయం వాటితో గడపడం వల్ల జరిగే అవకాశం ఉంది. అయితే విజ్ఞానం, సాంకేతికత ఒక సాధనం మాత్రమే; దాన్ని మానవ సంక్షేమం కోసం ఉపయోగించాలా, విధ్వంసం కోసం వాడాలా అనేది మన ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. అది మన హేతుత్వం ఆధారపడి ఉంటుందనే విషయం మరువరాదు.
7. విజ్ఞానం – భవిష్యత్ దిశ:
భవిష్యత్తులో విజ్ఞానం మరింత విస్తరించబోతోంది. కృత్రిమ మేధస్సు మానవ ఆలోచనలను అనుకరించబోతోంది. జన్యు ఇంజనీరింగ్ ద్వారా రోగాలను నివారించవచ్చు. అంతరిక్ష కాలనీలు మనిషి కొత్త నివాసంగా మారవచ్చు. క్వాంటం కంప్యూటింగ్ సమాచార విప్లవంలో కొత్త యుగాన్ని తెరవబోతోంది. కానీ భవిష్యత్ మనిషి చేతుల్లోనే ఉంది. విజ్ఞానాన్ని ఎలా వినియోగించాలో మనమే నిర్ణయించాలి.
8. విజ్ఞాన తాత్విక పాఠాలు: తాత్వికంగా శాస్త్రజ్ఞానం మనకు మూడు ప్రధాన పాఠాలను చెబుతుంది:
A. ప్రశ్నించడం ఆపకండి – ప్రతి ప్రశ్న ఒక కొత్త జ్ఞాన ద్వారం.
B. ఏ సత్యం శాశ్వతం కాదు, తాత్కాలికం – ప్రతి సత్యం మరో లోతైన సత్యానికి దారి తీస్తుంది.
C. జ్ఞానం – మానవత్వం కోసం – విజ్ఞానం విలువ దాని మానవ సేవలో ఉంది.
విజ్ఞానం విస్తరిస్తూనే ఉంది; అది ఆగదు. ఇది మనిషి అంతులేని జిజ్ఞాస, అన్వేషణ, సత్యాన్వేషణకు ప్రతిరూపం. కానీ ఈ విస్తరణను మానవ సంక్షేమం, శాంతి, సమానత్వం కోసం వినియోగించగలిగితేనే విజ్ఞానం నిజమైన అర్థంలో మహోన్నతమవుతుంది.
విజ్ఞానం విస్తరించడం అనేది మానవ ప్రగతికి సంకేతం. ఇది మన జిజ్ఞాస, పరిశోధన, ఆవిష్కరణల ఫలితం. కానీ శాస్త్రజ్ఞానాన్ని సక్రమంగా ఉపయోగించడం ద్వారా మాత్రమే నిజమైన మానవ సంక్షేమం సాధ్యమవుతుంది. అందుకే తాత్విక దృష్టిలో విజ్ఞానానికి ఇచ్చే అంతిమ నిర్వచనం ఏమిటంటే - విజ్ఞానం అనేది మానవుడి జిజ్ఞాసకు ప్రతిరూపం, మానవవాద లక్ష్యానికి సహకరించే సాధనం.
(రచయిత The Humanist Way యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు, ఫోన్ నెంబర్: 7780664115)
Comments
Post a Comment