ఒకే కాలంలో 1818 నుండి 1890 వరకు మార్క్స్ కమ్యూనిజం పూలే హ్యూమనిజం మానవాళిని అమితంగా ప్రభావితం చేశాయని చెప్పాలి. సోషలిస్టు నాయకుడిగా కార్ల మార్క్స్ సోషల్ రీఫార్మర్ గా మహాత్మ జ్యోతిబా పూలే లు తమ భావజాలం, పోరాటాలతో సమాజంలోని పీడిత వర్గాల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు. వర్గ రహిత సమాజం కోసం మార్క్స్, కులరహిత సమాజం కోసం పూలే కృషి సమానత్వం అనే లక్ష్యసాధన కోసం చేసిన పోరాటాలు. సమాజంలోని అన్ని అనర్ధాలకి మూలం వర్గం అని మార్క్స్ భావిస్తే కులం అని పూలే భావించారు. 1848లో మార్క్స్ ప్రచురించిన కమ్యూనిస్టు మేనిఫెస్టో పెట్టుబడిదారులను దోపిడి వర్గంగా భావిస్తే 1873లో పూలే నెలకొల్పిన సత్యశోధక్ సమాజ్ చాతుర్ వర్ణ వ్యవస్థలోని బ్రాహ్మణ వర్గాన్ని దోపిడి వర్గంగా భావించింది. పెట్టుబడిదారీ వర్గం చేత దోపిడీకి గురవుతున్న శ్రామిక వర్గం పక్షాన మార్క్స్ తన రచనలు కొనసాగిస్తే, బ్రాహ్మణ వర్గం చేత పీడించబడే అణగారిన వర్గాల పక్షాన పూలే తన పోరాటాలు కొనసాగించాడు. దోపిడికి వ్యతిరేకంగా సమానత్వ సాధనే లక్ష్యంగా మార్క్స్- పూలే లు తమ రచనలు, పోరాటాలు కొనసాగించారు కాబట్టే వారిని ఆచరణాత్మక ఆదర్శవాదులుగా సమాజం గుర్తిస్తుంది.
దేవుని కంటే మానవహక్కులే గొప్పవి అని మహాత్మ పూలే భావించారు. భారతీయ సామాజిక వ్యవస్థని నిట్ట నిలువునా చీల్చుతున్న కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, అణగారిన వర్గాల హక్కులను హరించి వేస్తున్న సామాజిక కట్టుబాట్లకు వ్యతిరేకంగా గళమెత్తి ఉద్యమించిన మొట్టమొదటి సామాజిక సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిబాపూలే. అమెరికా నల్లజాతి సూర్యుడు అబ్రహం లింకన్ నల్లజాతీయుల బానిసత్వ నిర్మూలన కోసం చేసిన పోరాటంతో స్ఫూర్తి పొందిన మహాత్మ పూలే దేశంలో కుల వ్యవస్థ నిర్మూలన కోసం సమానత్వం కోసం చేసిన పోరాటం భారతదేశ సామాజిక సంస్కరణల ఉద్యమంలో ఒక గొప్ప మైలురాయిగా భావించాలి.
సమాజంలో దోపిడీకి, అసమానతలకి, సామాజిక కట్టుబాట్లకు, అంటరానితనానికి, కుల వ్యవస్థకి, వర్గ దృక్పథానికి మూలం అవిద్యే అన్ని అనర్థాలకు మూలం విద్య లేకపోవడమే అని బలంగా నమ్మిన జ్యోతిబా పూలే సామాజిక సమానత్వం కోసం తన సంస్కరణల ఉద్యమంలో భాగంగా మొట్టమొదటి ప్రయత్నంగా అప్పటివరకు విద్యకు దూరంగా నెట్టివేయబడిన బాలికలు నిమ్మన వర్గాలైన శూద్రులు అతిశూద్రుల కోసం 1848లో పూణే బడేవాడలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ఏర్పాటు చేసినారు. 1852లో అంటరాని కులాల కోసం అస్పృశ్యుల కోసం, 1855లో రైతులు స్త్రీలు శ్రామికులు వయోజనుల కోసం రాత్రి బడులను ప్రారంభించారు. విద్య ద్వారానే బానిసత్వం నుండి విముక్తి, సమానత్వం సాధించబడుతుందని అణగారిన వర్గాలలో విద్యా వ్యాప్తి కోసం భార్య సావిత్రిబాయి పూలే సహచర్యంతో అనేక పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యా విప్లవానికి మహాత్మా పూలే నాంది పలికారు.
దేశంలోని సామాజిక సమస్యలపై ఉద్యమించిన తొలి సంఘసంస్కర్త మహాత్మా పూలే. కుల వ్యవస్థకి, అంటరానితనానికి, బాల్యవివాహాలకి, మూఢనమ్మకాలకి, భ్రూణ హత్యలకి, సతీసహగమనానికి, మద్యపానానికి వ్యతిరేకంగా, స్త్రీల హక్కుల కోసం ముఖ్యంగా వితంతువుల హక్కుల కోసం వారి రక్షణ కోసం, రైతు కార్మిక సమస్యలపై మహాత్మ జ్యోతిబాపూలే పోరాటాలు చేశారు. సామాజిక సమస్యల నిర్మూలన ద్వారానే స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం సాధ్యమవుతుందని అసమానతలు లేని ప్రపంచం మొత్తం ఒక కుటుంబంగా మారాలని సార్వజనిక సత్య ధర్మాన్ని ప్రతిపాదించిన పూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్ర సతారాలో జన్మించారు. సామాజిక, లింగ, వర్ణ సమానత్వం కోసం పోరాడిన జ్యోతిబా పూలేని సావిత్రిబాయి పూలేని భారతరత్న లాంటి అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేయటం ద్వారా వారి సేవలకు సమున్నత గౌరవం దక్కుతుందనే భావన వ్యక్తమవుతుంది.
డాక్టర్ తిరునహరి శేషు
అసిస్టెంట్ ప్రొఫెసర్
కాకతీయ విశ్వవిద్యాలయం
9885465877
(ఏప్రిల్ 11 మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకొని)
Comments
Post a Comment