రాచరిక వ్యవస్థ లో మహారాజులు/రాణులు బయటకు వెళ్లినప్పుడు వారిని మోయడానికి బోయిలు ఉండేవారు. నేటి ప్రజాస్వామ్య వ్యవస్థ లొ కూడా ఆధిపత్య కుల కులాల వారు పదవులు అధిష్టించడానికి ఓటర్లనే బహుజన వర్గాల వారు మోస్తూనే ఉన్నారు. దీనికి నిదర్శనమే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు. విచిత్రమేమిటంటె ఏమిటంటే, ఇక్కడ ఆధిపత్య కుల మహిళలు తల్లిదండ్రులను, అన్నా తమ్ముళ్ళను కూడా లెక్క చేయకుండా పార్టీ లు స్ధాపించిఅధికారం కోసం తమ వారితోటే పోటీ పడుతున్నారు. బహుశా దేశంలో ఎక్కడా ఇలాంటి వాతావరణం ఎక్కడ ఉండదేమో.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక కొత్త తరహా రాజకీయ దృశ్యం రూపుదిద్దుకుంటోంది. ఒకే కుటుంబంలోనే రెండు రాజకీయ ధృవాలు ఏర్పడి, అధికారం కోసం పోటీ పడుతున్నాయి. ఒకరి పై ఇంకొకరు కత్తులు దూసుకుంటున్నారు ,బహుజనులను పిచ్చి వాళ్ళను చేస్తున్నారు .వాళ్ళ అవినీతి చిట్టాలను బయటపెట్టుకొంటున్నారు .ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ కుటుంబంలో అన్న–చెల్లెల్ల మధ్య అధికారం కోసం పోటీ, తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో తండ్రి–కూతుళ్ల మధ్య రాజకీయ పోటీ. బయటకు ఇది భిన్న పార్టీల మధ్య పోటీలా కనిపించినా, లోపలికి చూస్తే ఇది ఒకే కుటుంబం లోపల అధికారం పంచుకునే ఓ రాజకీయ కు తంత్రం .
అయితే ఈ ఆటలో బహుజనుల పాత్ర ఏమిటి? వారు పల్లకీ మోసే బోయిలేనా, ఓటు వేసే యంత్ర లేనా ? వారికి చివరకు మిగిలేది గులాం గిరియేనా?తమ ఓట్లతో రాజ్యాలను నిర్మిస్తారు, కానీ ఆ రాజ్యాల్లో తమకో స్థానం లేకుండా చేసుకుంటున్నారనే నిజాన్ని గుర్తించలేకపోతున్నారు. ఆధిపత్య కుల రాజకీయ కుతంత్రాలను అర్థం చేసుకోలేక, ఈ ఆటలో పావులుగా మారుతున్నారు.
నిజానికి ఇది ఒకే కుటుంబంలో అధికారం పంచుకునే రాజకీయ క్రీడ . బహుజనులను రాజకీయ అధికారానికి దూరంగా నెట్టే ప్రణాళికబద్ధమైన కుట్ర. వారు అధికారం కోసం రక్త సంబంధాలు లెక్క చేయ కుండ పోరాడుతుంటే, సమాజంలో మెజారిటీ ప్రజల అయిన బీసీలు తమ ముష్టి డిమాండ్ల కోసం పోరాడాల్సి వస్తోంది. 42% రిజర్వేషన్, కులగణన, బడ్జెట్ లో కేటాయింపులు, నిధుల విడుదల, ఉపకార వేతనాల చెల్లింపులు మొదలగునవి.
ఇవి ఎలాంటి గొంతెమ్మ కోరికలు కావు. ఇవి మనుగడ, గౌరవం, రాజ్యాంగ హక్కులకు సంబంధించినవి. అయినప్పటికీ, ఈ డిమాండ్లు సంవత్సరాలుగా పెండింగ్‌లోనే ఉండటం, బీసీలు నిరంతరం ధర్నాలు, నిరసనలు, పోరాటాలపై ఆధారపడాల్సి రావడం ,ఈ వ్యవస్థలోని అసమానతను స్పష్టంగా బయటపెడుతోంది. రాజ్యాధికారమే సమస్యలకు పరిష్కారం అనే విషయాన్నీ బహుజనులు ఇంకా తెలుసు కోలేక పోతున్నారు , ఆధిపత్య కులాల సేవ లో తరించి పోతున్నారు.
గతంలో కుటుంబ వారసత్వ పాలన మాత్రమే ఉండేది. ఇప్పుడు దానికంటే ప్రమాదకరమైన దశలోకి రాజకీయాలు మారాయి . అధికారాన్ని కోల్పోకుండా ఉండేందుకు ఒకే కుటుంబంలో రెండు, మూడు పార్టీలు ఏర్పాటు చేసి, అధికారం తమ పరిధిలోనే బంధించే కొత్త తంత్రం. ఇది ప్రజాస్వామ్యం కాదు; ఇది కుటుంబాధిపత్యానికి కొత్త ముసుగు.
ప్రజాస్వామ్యం అంటే సమాన అవకాశాలు, సమాన ప్రాతినిధ్యం, సమాన గౌరవం. కానీ నేటి వాస్తవం ఏమిటి? రాజకీయ శక్తి కొద్దిమంది కుటుంబాలు, కొద్దికులాల చేతుల్లో కేంద్రీకృతమై ఉంది. ఎన్నికల సమయంలో పోటీ కనిపించినా, అది నిజమైన సిద్ధాంతపరమైన పోటీ కాదు . అదే వర్గం లోపల అధికార మార్పిడి మాత్రమే. ఇది కేవలం రాజకీయ వైఫల్యం కాదు ఇది సామాజిక అన్యాయం యొక్క ప్రతిబింబం.
ఒకవైపు ఆధిపత్య వర్గాలు కుటుంబ పాలన, అక్రమ సంపాదన, మీడియా మేనేజ్మెంట్, ఎన్నికల్లో డబ్బు శక్తి, రౌడీ రాజకీయాలతో అధికారాన్ని కైవసం చేసుకుంటుంటే, మరోవైపు బహుజనులు కనీస అవసరాల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి.
ఈ దృశ్యం చూస్తే ఒక ప్రశ్న తప్పక తలెత్తుతుంది . ఇది నిజంగా ప్రజాస్వామ్యమేనా? లేక ఆధిపత్య వర్గాల ప్రైవేట్ సామ్రాజ్యమా? ప్రజాస్వామ్యంమంటే కేవలం ఓటు వేయడం కాదు; అది ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం కావాలి. కానీ నేడు మెజారిటీ అయిన బీసీలు సరైన ప్రాతినిధ్యం లేదు ,ఆధిపత్య కుల పార్టీ ల లో ఆత్మ వంచన చేసుకొని బతుకుతున్నారు . వారి గొంతు వినిపించాలంటే ఇంకా పోరాటమే మార్గంగా మారింది.
ఈ పరిస్థితి మారాలంటే అర్థసత్యాలు కాదు , స్పష్టమైన రాజకీయ మార్పు అవసరం. సామాజిక చైతన్యం, రాజకీయ అవగాహన, బహుజన ఐక్యత ఇవే మార్గాలు.బీసీలు, బహుజనులు తమ ఓటు విలువను గుర్తించాలి, ప్రలోభాలకు లొంగకుండా ఉండాలి,తమ కుల చైతన్యాన్ని బీసీ శక్తి గ సంఘటితం చేసుకోవాలి.
ఆధిపత్య కులాల మీడియా, కుటుంబ రాజకీయాలు కలిపి సృష్టిస్తున్న అగ్రకుల మిథ్య భావజాలంలో కొట్టుకుపోవద్దు. వారి కి జై కొట్టి, జంఢాలు మోసి బానిసలుగా మారవద్దు. స్పృహ తెచ్చుకోండి. మీ దుస్థితికి కారణమైన రాజకీయ శక్తులను గుర్తించండి. మీ ఓటు అనే వజ్రాయుధంతో వారిని అంతమొందించండి , బానిస సంకెళ్లు తెంచుకోండి.
నిజం చెప్పాలంటే , ఇది నిజమైన రాజకీయ పోటీ కాదు, ఇది ఆధిపత్య వర్గాల మధ్య అధికారం పంచుకునే ఆట. మెజారిటీ ప్రజలైన బీసీలు, బహుజనులను అధికారానికి దూరంగా ఉంచే ఓ రాజకీయ ఎత్తుగడ .ఈ సత్యాన్ని అర్థం చేసుకొని, దాన్ని సరిచేసే దిశగా ముందుకు సాగకపోతే, “ప్రజాస్వామ్యం” అనే పదం అర్థం కోల్పోతుంది. గతము లో మీ కొరకు పని చేసే బహుజన పార్టీ లు లేకుండెడివి , ఇప్పుడు వస్తూనే వున్నాయి , వారిని ఆదరించండి ,ఈ అగ్రకుల పార్టీ లను తిరస్కరించండి .
ఆధిపత్య కుల మహిళలు తెగించి రాజ్యాధికారాన్ని సాధించేందుకు నిర్భయంగా ముందుకు సాగుతున్న ఈ కాలంలో, బీసీలు ఇంకా స్పృహను సంపాదించుకోలేకపోవడం తెలుగు రాష్ట్రాల దౌర్భాగ్య స్థితిని ప్రతిబింబిస్తుంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రుల స్థాయికి ఎదిగిన ఉదాహరణలు ఉన్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆధిపత్య వర్గాల రాజకీయ అడ్డంకులు వీరిలో ఆ రాజకీయ కాంక్ష లేక పోవటం,వారిని ఆ స్థాయికి చేరనివ్వడం లేదు.
సంపదలోనూ, అవకాశాల్లోనూ బీసీలకు సరైన స్థానం లేకపోవడం మరింత విషాదకరం. భూమిలో (Land), ఇసుకలో (Sand), గనుల్లో (Mines), మద్యం వ్యాపారంలో (Wine), విద్యలో (Education), ఔషధ రంగంలో (Pharma)—ఏ రంగాన్ని పరిశీలించినా బీసీలు వాటాలో వెనుకబడి ఉన్నారు .ఇది యాదృచ్ఛికం కాదు; ఇది నిర్మాణాత్మక అసమానతల ఫలితం.
ఇంతటి అన్యాయ పరిస్థితుల్లో కూడా, బీసీలు ఇంకా చైతన్యం కోల్పోయి ఆధిపత్య వర్గాల రాజకీయాలకు మద్దతు ఇస్తూ ఉండటం ఆందోళన కలిగించే విషయం. అయితే, ఈ పరిస్థితిని మార్చేందుకు నేడు బీసీల కోసం పనిచేసే సంస్థలు, పార్టీలు వేదికలు ముందుకు వస్తున్నాయి.
వారిని ఆదరించండి.
ఇప్పటికైనా బీసీలు తమ స్థితిని గమనించి, చైతన్యంతో ముందుకు రావాలి. బహుజనుల ఓట్లు బహుజనులకే వినియోగించి, తమ స్వంత నాయకత్వాన్ని నిర్మించుకొని, రాజ్యాధికారాన్ని సాధించుకోవడం సమయానుకూలమైన అవసరం.
ఇప్పుడు సమయంఆసన్నమైనది . ఆధిపత్య కుల రాజకీయాలను అర్థం చేసుకుని “ఓట్లు మావి… సీట్లు మీవా?” అని ప్రశ్నించే సమయం. అలాగే.” ఓటు మావే సీటు మావే “అని గర్జించే సమయం. మేల్కొండి… మీ తలరాతలను మీరే రాసు కొండి , బానిస సంకెళ్లు ఛేదించండి , రాజ్యాధికారాన్ని చేతబట్టండి.
టి .చిరంజీవులు. విశ్రాంత ఐఏఎస్ మరియు చైర్మన్ బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరమ్
Comments
Post a Comment