ఆరు దశాబ్దాల సుదీర్ఘ ఉద్యమ ఫలితంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక అత్యున్నత రాష్ట్రంగా ఎదుగుతుందని తెలంగాణ ప్రజలు ఆశించారు కానీ ఈ దశాబ్దపు తన ప్రస్థానంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నాటి ఉద్యమ ఆకాంక్షలు, ఆశయాలకి దూరంగానే ప్రయాణిస్తున్నట్లుగా కనపడుతుంది.తొలి పాలకుల బంగారు తెలంగాణ నుండి నేటి పాలకుల తెలంగాణ రైజింగ్ వరకు ప్రభుత్వాల నిర్దేశిత లక్ష్యాలు గొప్పగానే కనపడుతున్నాయి కానీ ఆ లక్ష్యాలను సాధించే క్రియా శూన్యత వలన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరటం లేదనే అసంతృప్తి ప్రజలలో గూడు కట్టుకొని ఉన్నది. ఐఎస్ బి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్- 2047 పైన డిసెంబర్ 8 మరియు 9 తేదీలలో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో విజన్ డాక్యుమెంట్ ప్రజల కోసమా! పెట్టుబడిదారుల కోసమా! ఎవరికోసం అనే ప్రశ్నలు
ఉత్పన్నమవుతున్నాయి.తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్- 2047 గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే 1999లో నాటి సమైక్య ఆంధ్ర పాలకులు కల్పించిన విజన్- 2020 డాక్యుమెంట్ భ్రమలు తెలంగాణ ప్రజలకి మరొకసారి గుర్తుకొస్తున్నాయి.
విజన్ డాక్యుమెంట్ - 47 ఏమిటి?
దక్షిణ కొరియా, సింగపూర్, తైవాన్ లాంటి దేశాలు తక్కువ సమయంలో సాధించిన ప్రగతి లాగానే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక రోరింగ్ లయన్ గా ఎదిగే సామర్థ్యం ఉన్నది. రాష్ట్రం ఏర్పాటైన ఈ పుష్కరకాలంలో ప్రజల కోసం కాకుండా పాలకుల ఆలోచనలకి అనుగుణంగానే విధానాలు రూపొందించబడ్డాయి అమలు చేయబడ్డాయి.విభజిత రెండు తెలుగు రాష్ట్రాలు సమగ్ర అభివృద్ధి కోసం ఆంధ్ర ప్రదేశ్ స్వర్ణాంధ్రవిజన్- 47 ని తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్- 47 ని రూపొందించాయి. పారిశ్రామిక అభివృద్ధికి పెట్టుబడుల ఆకర్షణ, నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకి ఉపాధి కల్పన, రైతుల ఆదాయాల పెంపు, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా ఎదగటానికి అవకాశాలు కల్పించే లక్ష్యంగా విద్య ఆరోగ్యం, ఉపాధి, పరిశ్రమలు, క్రీడలు, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, సాంకేతికత లాంటి ఎనిమిది రంగాలపై (అష్టపది) దృష్టి పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ విజన్ డాక్యుమెంట్ ని రూపొందించింది.
2034 నాటికి రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రూపొందించడానికి రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ పేరుతో మూడు రీజియన్లుగా విభజిస్తూ రాబోయే 22 సంవత్సరాలలో రాష్ట్రం సాధించే ప్రగతి కోసం ఈ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్- 2047 ని రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది.మొదటి రీజియన్ లో హైదరాబాద్ కోర్ నగరాన్ని, రెండవ రీజియన్ లో జిల్లా కేంద్రాలను, మూడవ రీజియన్ లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ లో ప్రణాళికలు రూపొందించారు.
ఏఐ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, క్వాంటం టెక్నాలజీ, స్టార్ట్ అప్ లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా లాంటి కీలకమైన పరిశ్రమలలో పెట్టుబడులను ఆకర్షించటం, గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్, ఐటిసిలు, టాస్క్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ లతో నైపుణ్యాలు పెంచడం ద్వారా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం, ఉద్యానవనాల సాగు పెంపు, సాగులో సాంకేతికత ద్వారా మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటల వైపుకి రైతులను మళ్ళించడం ద్వారా రైతుల ఆదాయాలను పెంచడం, ఇందిరా మహిళా శక్తి పథకాల ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని విజన్ డాక్యుమెంట్ లో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఫోర్త్ సిటీ నిర్మాణం, ఏఐ యూనివర్సిటీ, స్కిల్, స్పోర్ట్స్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు, రీజనల్ రింగ్ రోడ్లు, రేడియల్ రోడ్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు, హై స్పీడ్ మొబిలిటీ కారిడార్లు, కొత్త విమానాశ్రయాలు, డ్రై పోర్టు నిర్మాణం, నైట్ ఎకానమీ, పర్యాటకం లాంటి కీలకమైన అంశాలను విజన్ డాక్యుమెంట్ లో పొందుపరుస్తూ పారదర్శక పాలన సులభతర అనుమతులతో (ఈ ఓ డి బి) 2047 నాటికి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలనేది ప్రభుత్వ విధానంగా కనపడుతుంది.
రైజింగ్ లో పేదలకి చోటు ఎక్కడ?
రైతులు, మహిళలు, యువత మరియు పేదలే మా ప్రధాన అజెండా అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2025 - 26 బడ్జెట్ ప్రవేశపెట్టారు కానీ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లో పెట్టుబడిదారులకి రెడ్ కార్పెట్ పరుస్తూ, యువత, మహిళలు మరియు రైతులే మా ప్రాధాన్యతా అంశాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు కానీ నాటి విజన్- 20 20 హైటెక్ సిటీ నుండి నేటి తెలంగాణ రైజింగ్ భారత్ ఫ్యూచర్ సిటీ వరకు పెట్టుబడిదారులకు దక్కిన ప్రాధాన్యత పేదల ప్రయోజనాలకి వారి సంక్షేమానికి విజన్ డాక్యుమెంట్ లో చోటు దక్కుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లో కూడా పరిశ్రమలు పెట్టుబడుల ఆకర్షణకి దక్కిన ప్రాధాన్యత చూస్తేనే అర్థమవుతుంది. విజన్ డాక్యుమెంట్ విడుదల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ పెట్టుబడి సంస్థలతో దరిదాపు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఎంవోలు చేసుకోబోతుంది నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన ఐటీ విధానం, టిఎస్ ఐపాస్ లాంటి పారిశ్రామిక విధానాలకి తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ కాస్త భిన్నంగా కనపడుతుంది కానీ పెద్దగా నిర్మాణాత్మకమైన తేడా ఏమీ కనపడటం లేదు. తెలంగాణ లాంటి ఉద్యమ నేపథ్యంతో ఏర్పాటైన రాష్ట్రానికి కావలసింది తెలంగాణ రైజింగ్ లాంటి నమూనానా లేక కేరళ ఇటీవల అత్యంత పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించిన నమూనానా పాలకులు ఆలోచించుకోవాలి. పక్కా ఇల్లు, భూ పంపిణీ, రేషన్ కార్డులు, పెన్షన్లు, ప్రజా ఆరోగ్య కేంద్రాలు, ఉచిత వైద్య భీమా, శుద్ధమైన త్రాగునీరు లాంటి సౌకర్యాల కల్పన ద్వారా కేరళ రాష్ట్రం అత్యంత పేదరికాన్ని కేవలం మూడు సంవత్సరాలలో అధిగమించగలిగితే మరి 84 శాతం అట్టడుగు సామాజిక వర్గాల ప్రజలు ఉన్న తెలంగాణ రాష్ట్రం ఎందుకు అలాంటి విజయాల వైపు అడుగులు వేయలేకపోతుందో పాలకులు ఆలోచించాలి.
లక్ష్యాలు సాధించేనా!
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక్క పెట్టుబడుల ఆకర్షణలో తప్ప (మూడు లక్షల కోట్లకు సంబంధించిన పెట్టుబడి ఒప్పందాలు జరిగాయి) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హామీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో కానీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కానీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కానీ ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.మా పోటీ కర్ణాటక తమిళనాడు లాంటి ఇతర రాష్ట్రాjలతో కాదు చైనా జపాన్ సింగపూర్ దక్షిణ కొరియా లాంటి దేశాలతో పోటీ పడతామని ముఖ్యమంత్రి చెపుతున్నారు కానీ పెట్టుబడుల ఆకర్షణలో, జిఎస్ డీపీలో మహారాష్ట్రతో, సంక్షేమ పథకాల అమలులో తమిళనాడుతో, పేదరిక నిర్మూలనలో, మానవాభివృద్ధిలో, అక్షరాస్యతలో కేరళతో తెలంగాణ రాష్ట్రం పోటీపడాలి తెలంగాణ రాష్ట్రం సంపన్న రాష్ట్రంగానే కాదు సంక్షేమ రాష్ట్రంగా ఎదిగినప్పుడే ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయి.8 నిమిషాల కార్యక్రమానికి 80 లక్షల ప్రజాధనాన్ని పాలకులు వృధా చేస్తే 2028 నాటికి తెలంగాణ రాష్ట్రం అప్పులు 12 లక్షల కోట్ల రూపాయలకు పెరిగి తెలంగాణ రాష్ట్రం ఒక రుణగ్రస్థ రాష్ట్రంగా మారుతుంది.విజన్ డాక్యుమెంట్ లో నిర్దేశిత లక్ష్యాల సాధనకి ప్రభుత్వ సంకల్పంతో పాటు అధికారుల క్షేత్రస్థాయి పనితీరు కూడా నిర్ణయాత్మకంగా ఉంటుంది.పెట్టుబడిదారులకి వనరులు దోచిపెట్టే విజన్ డాక్యుమెంట్లు కాకుండా కేరళ మోడల్ లాగా ప్రజల కేంద్రంగా విజన్ డాక్యుమెంట్లు ఉంటే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక అత్యున్నత రాష్ట్రంగా ఎదుగుతుంది.
డాక్టర్ తిరునహరి శేషు
9885465877
Comments
Post a Comment