రెండు వసంతాల పాలనలో విజయాలు - అపజయాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఒక దుశాబ్దపు నిరీక్షణ తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టింది.ఒక దశాబ్ద బిఆర్ఎస్ పాలనపై ప్రజా వ్యతిరేకత, మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చింది.అప్పటి వరకు కనీసం మంత్రిగా కూడా పనిచేయని రేవంత్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో అనుమానాలతో ప్రారంభమైన రేవంత్ రెడ్డి పాలన రెండు వసంతాలు పూర్తిచేసుకుని మూడవ వసంతంలోకి అడుగుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై, రేవంత్ రెడ్డి పనితీరుపై రాష్ట్ర వ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది. పాలనా అడ్డంకులను అధిగమిస్తూ, ప్రతిపక్షాలను రాజకీయంగా ఎదుర్కొంటూ, అభివృద్ధికి కొత్త విధానాలను రూపొందిస్తూ, సంక్షేమ హామీలను నెరవేర్చే క్రమంలో రెండు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనుకకు లాగా ఈ రెండు వసంతాల తన ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందనే భావన కలుగుతుంది.
సంక్షేమంలో తన మార్కు ఎక్కడ?
సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీని ఒక బ్రాండ్ అంబాసిడర్ గా భావిస్తారు. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108 లాంటి సంక్షేమ పథకాలతో సంక్షేమ అజెండాపై ఒక చెరగని ముద్ర వేశారు.తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు, ఐదు డిక్లరేషన్లు, 420 హామీలు అధికారాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించాయి. అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని గ్యారెంటీ కార్డులను పంచిన కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయలేకపోవడమే కాదు ముఖ్యమైన గ్యారెంటీలను కూడా అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వ విశ్వశనీయతను ప్రతిపక్షాలు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
6 గ్యారంటీలలో ఉన్న 13 హామీలలో 8 హామీలను మాత్రమే ప్రారంభించారు కానీ వాటి లక్ష్యాలను కూడా చేరుకోలేదు.ఇందిరమ్మ ఇల్లు లాంటి గ్యారెంటీ ఈ రెండు సంవత్సరాలలో ఎనిమిది లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి కానీ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు లక్ష ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేయలేదు. మహాలక్ష్మి గ్యారంటీలో ఫ్రీ బస్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లాంటి హామీలు అమలు చేసి ప్రతి మహిళకి నెలకి 2500 రూపాయలు ఇచ్చే హామీని నెరవేర్చక పోవటం, చేయూత గ్యారెంటీలో ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచి లక్షలాదిమంది వృద్ధులకి వ్యక్తిగత ప్రయోజనం కలిగే పెన్షన్ 4000 రూపాయలకు పెంచకపోవడంతో గ్యారంటీల అమలులో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందనే అభిప్రాయం కలుగుతుంది.ఆరు గ్యారెంటీల అమలుకి బడ్జెట్ లో ప్రభుత్వం 56 వేల కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించింది కానీ వాటిని కూడా పూర్తిగా ఖర్చు చేయటం లేదు.
వివిధ సామాజిక వర్గాల సంక్షేమం పట్ల కూడా సంతృప్తి వ్యక్తం కావడం లేదు.25 లక్షల మంది రైతులకి 21 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినా, సన్నాలకి బోనస్ ఇచ్చినా, 15000 రూపాయల రైతు భరోసా హామీ నిలబెట్టుకోకపోవడం, ఒక విడత రైతు భరోసాని ఎగవేయటం, యూరియా కష్టాలు, గిట్టుబాటు ధరలు లేకపోవడం, రైతు కూలీలకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద సంవత్సరానికి 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వకపోవడం, దళిత బంధు ఊసే లేకపోవడం, యువతకి రాజీవ్ యువ వికాసం పథకం క్రింద ఆర్థిక సహాయం అందకపోవటం, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని రెండు చీరలకు బదులుగా ఒక్క చీరనే ఇవ్వటం, ఆడబిడ్డలకి తులం బంగారం, స్కూటీలు ఇవ్వకపోవడం, తప్పుల తడకగా కుల గణన, 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో వైఫల్యం, బడ్జెట్ లో బీసీ సామాజిక వర్గాలకు తక్కువ నిధులు కేటాయించటంతో ఆయా వర్గాల నుండి ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తంమవుతుంది. బడ్జెట్ లో వివిధ సామాజిక వర్గాల సంక్షేమం కోసం లక్ష కోట్ల రూపాయలను కేటాయించి ఆ నిధులను కూడా ఖర్చు చేయడం లేదనే విమర్శలు తలెత్తుతున్నాయి. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అకౌంట్లో జమ కాకపోవటం, ఉచిత విద్యుత్తు లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలు చేయటంతో లబ్ధిదారుల నుండి ప్రభుత్వం పై వ్యక్తిరేకత వ్యక్తంమవుతుంది. మహిళలకి ఫ్రీ బస్సు సౌకర్యం, మూడు కోట్ల మంది పేదలకు సన్న బియ్యం పంపిణీ లాంటి పథకాలు పర్వాలేదనిపిస్తున్నాయి.ఈ రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనలో ప్రజల మనసుపై ముద్ర వేసిన పథకాలు, ప్రజల జీవితాలను మార్చిన ఒక్క సంక్షేమ పథకం లేదంటే అతిశయోక్తి కాదు.
ముందుకు సాగని అభివృద్ధి ప్రణాళికలు
అభివృద్ధి, సంక్షేమం మా ప్రభుత్వాలకు రెండు కళ్ళు అని ప్రభుత్వాలు తరచూ చెబుతుంటాయి కానీ ఈ దశాబ్ద కాలంలో తెలంగాణని ఉన్నత స్థాయిలో నిలబెట్టే అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉండటం బాధాకరం. అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గత ప్రభుత్వం కాలేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ని పూర్తి చేసినా దాని చుట్టూ వివాదాలు, విద్యుత్ ప్రాజెక్టులు పూర్తికాకపోవటం, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను సాధించలేకపోవటంతో ఆశించిన స్థాయిలో అభివృద్ధి ముందుకు సాగలేదు.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలమూరు రంగారెడ్డి లాంటి మరొక కీలకమైన ప్రాజెక్టుని పూర్తి చేయలేదు, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను సాధించలేదు, పెరగని రాష్ట్ర ఆదాయం, చేసిన 2.22 లక్షల కోట్ల రూపాయల అప్పులు, అన్ని స్థాయిలలో విపరీతంగా పెరిగిన అవినీతి వలన రాష్ట్ర అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రెండుసార్లు పాల్గొని అమెరికా, సింగపూర్, దక్షిణ కొరియా లాంటి దేశాలలో పర్యటించి మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు, తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్- 2047 సదస్సులో 5.75 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకోవడం లో ఈ ప్రభుత్వం కొంతమేరకు లక్ష్యం దిశగా పయనించిందనే చెప్పాలి.మూసి రివర్ ఫ్రంట్ ప్రక్షాళనతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచే ప్రయత్నం ,రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ - 2047 భవిష్యత్తు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతాయనే భావన వ్యక్తంమవుతుంది.మానవాభివృద్ధిలో కీలక రంగాలైన విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో ఈ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాలలో పెద్దగా విప్లవాత్మకమైన మార్పులు ఏమి తీసుకురాలేదు.ఈ రంగాలకి బడ్జెట్ లో కేటాయించి, ఖర్చు చేస్తున్న నిధులు కూడా తక్కువ,రాష్ట్రంలో 1000 కి పైగా గురుకులాలు ఉంటే 600 గురుకులాలు అద్దె భవనాలలో ఉన్నాయి ప్రభుత్వ బడులలో, హాస్పిటలలో సౌకర్యాలు మెరుగుపరచకుండా 100 నియోజకవర్గాలలో 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం ఎందుకు చేస్తున్నారో ప్రభుత్వమే చెప్పాలి. గత ప్రభుత్వ ఓటమిలో కీలక భాగస్వాములైన నిరుద్యోగులు కూడా ఈ ప్రభుత్వం పై అసంతృప్తి గానే ఉన్నారు.60 వేల ఉద్యోగాలు భర్తీ చేసాం మరొక 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నారు మరి గత ప్రభుత్వం ప్రకటించిన 80 వేల ఉద్యోగాలు ఎక్కడికిపోయినాయి ? మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ హామీ ఏమైంది? జాబ్ క్యాలెండర్ ఎక్కడికి పోయింది? అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ఈ రెండు సంవత్సరాల కాలంలో పార్టీలో అసంతృప్తులను, ప్రతిపక్షాలను కట్టడి చేయటంలో రేవంత్ రెడ్డి విజయం సాధించారనే చెప్పాలి. లోక్ సభ ఎన్నికలలో ఎమ్మెల్సీ ఎన్నికలలో మిశ్రమ ఫలితాలు సాధించినా ఉప ఎన్నికలలో విజయం సాధించి ప్రతిపక్షాలపై పైచేయి సాధించారు.గ్రామపంచాయతీ మొదటి దశ ఎన్నికలలో బిఆర్ఎస్ బిజెపిలు అధికార కాంగ్రెస్ కి గట్టి పోటీనే ఇచ్చాయి ఇది భవిష్యత్తు రాజకీయ పరిణామాలకు సంకేతంగా చూడాలి.ఉద్యమ లక్ష్యాలు, ఆకాంక్ష నిధులు నీళ్లు నియామకాలలో రేవంత్ రెడ్డి సర్కార్ అంచెనాలను చేరుకోలేకపోయింది అనే చెప్పాలి.ప్రగతిభవన్ పాలన కంటే ప్రజాపాలన భిన్నంగా ఏమీ లేదు పాలకులు మారారు తప్ప ప్రజల బ్రతుకులు పెద్దగా మారలేదనే అభిప్రాయాలు క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి.
డాక్టర్ తిరునహరి శేషు
9885465877
Comments
Post a Comment