Skip to main content

కనిపించని నాలుగో సింహమే బిసి

Chiranjeevulu T, IAS

దున్నపోతుకు గడ్డి పెట్టి బర్రెకు పాలు పితికినట్లు ఉంది నేడు మన దేశంలో బిసిల పరిస్థితి. మెజారిటీ (60 శాతం) ప్రజలైన బిసిలు అగ్రవర్ణ ,ఆదిపత్య కులాలకు ఓటు వేసి, పనుల కొరకు వారి చుట్టూ తిరిగుతూ, పనులు కాక అయ్యో మాకు అన్యాయం జరుగుతుంది అని గగ్గోలు పెడుతున్నది కూడా బిసిలే. తమ నాయకులను తాము ఎన్నుకోకుండా మందుకో, డబ్బుకో అమ్ముడు పోయే ఓటర్లుగా నేడు ముద్రపడి పోయినారు. తమ బతుకులను తామే తీర్చేదిద్దుకోక ఎవరో అగ్రవర్ణాల వాళ్లు వచ్చి బాగుపరుస్తారు అనే భ్రమలో మోసపోతున్నారు. స్వాతంత్ర్యనంతర 77 సంవత్సరాల కాలంలో బిసిలు అన్ని రంగాలలో తీవ్రంగా అన్యాయమునకు గురైనారు. అటు సకాలంలో విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు లేక, అభివృద్ధికి పథకాలు లేక కుదేలై పోయినారు. రాజకీయ రంగంలో రిజర్వేషన్లు లేక చతికల పడ్డారు. భారత రాజ్యాంగంలో వెనుకబడిన కులాలుగా కాకుండా వెనకబడిన తరగతులుగా నిర్వచింపబడి సామాజిక న్యాయం అందడంలో దశాబ్దాలుగా వేచి చూడాల్సి వస్తుంది. కనీసం వారి కులాల సంఖ్య, జనాభా తెలిపే లెక్కలు లేవు, కులగణన చేయండి అని అడుక్కునే దుర్భర పరిస్థితి దాపురించింది.

ఇప్పుడు కావలసింది: బిసిలలు రాజకీయ చైతన్యముతో తమ హక్కులు, అధికారంలో వాటా కొరకు ప్రజాస్వామ్యయుతంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది..

అందుకు బిసిలు చేయాల్సింది ఏమిటంటే....

1. బానిస మనస్తత్వం విడ నాడండి
: తాము పాలనకు పనికిరాము, అగ్రవర్ణాల సేవకులమనే ఆత్మ న్యూనత భావనను వదిలేయాలి. పక్క రాష్ట్రాలలో బిసిలు ముఖ్యమంత్రులుగా అయ్యి రాజ్యాధికారం చెలాయిస్తూ ఉంటే మనం ఇక్కడ శాసకులుగా కాక యాచకులుగా బ్రతుకుతున్నాము. ఎంతోమంది అద్భుతమైన బిసి లీడర్లను ఈ దేశానికి అందించినారు బిసిలు. స్వాతంత్ర అనంతరము అన్నాదురై, కరుణానిధి, కర్పూరీ ఠాకూర్, మూలయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, మొదలగు వారు ఉన్నారు. మన రాష్ట్రంలో పుంజాల శివశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, గౌతు లచ్చన్న, అర్గుల్ రాజారామ్, కృష్ణస్వామి ముదిరాజ్, బొమ్మగోని ధర్మబిక్షం మొదలగు వారు ఇచ్చిన స్ఫూర్తిని మనలో నింపుకొని రాజకీయ రంగంలో ముందుకు దూసుకెళ్దాం. బిసిలలో డబ్బు ఉన్న ఆసాములు ముఖ్యంగా యువత రాజకీయాలలోకి రావాలి. ఈ దేశానికి దిశా, దశా నిర్దేశం చేయాలి. మన బ్రతుకులు బాగుపడాలంటే మన చేతిలోనే అధికారం ఉన్నపుడే అది సాధ్యమవుతుంది. మేమెంతో మాకు అంతా వాటా అంటూ నినదిస్తూ ముందుకు సాగాలి. తెలంగాణలో జరిగిన అన్ని ఉద్యమాలలో త్యాగాలు బిసిలవి భోగాలు అగ్రవర్ణల వాళ్లవి. ఇక ఆ ఆటలు సాగనివ్వం అనే ఆత్మస్థైర్యంతో, నినాదంతో ముందుకు దూసుకెళ్లాలి. ఆటో నడిపే వారు కూడా మేము అధికారమునకు అనర్హులమా? మేము ఎందుకు రాజకీయ పదవులు చేపట్టవద్దు? అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు వచ్చి రాజకీయ ముఖచిత్రం మార్చాలి. బిసి లంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ కావు బ్రిలియంట్ క్యాస్ట్స్ అనే లాగా పట్టుదలతో కృషి చేయాలి.



2. బిసిలలో బిసి వాదం లేదు - కులవాదం తప్ప: తెలంగాణలో బిసిలు 134 కులాల సమాహారం. ఇందులో ఏ బి సి డి ఈ కేటగిరిలు ఉన్నవి. అంతేకాకుండా ప్రభుత్వం 2017 సంవత్సరంలో 35 కులాలను అత్యంత వెనకబడిన కులాలుగా గుర్తించింది. జనాభాపరంగా కొన్ని కులాలు పెద్ద సంఖ్యలో జనాభా కలిగి ఉన్నాయి. ఉదాహరణకు ముదిరాజ్, యాదవ, మున్నూరు కాపు, గౌడ, పద్మశాలి, పంచాయిన, రజక, గంగపుత్ర, నాయి బ్రాహ్మణ, పెరిక, కుమ్మరి మొదలైనవి. కానీ ఈ కులాలు కేవలం తమ కులం ఓట్లతోనే రాజకీయ అధికారాము చేపట్ట లేమనే విషయాన్ని గ్రహించాలి. ఏ కులానికి ఆ కులం వ్యవస్థీకృతమై ఉండి బిసిలుగా ఏకీకృతం కాలేక పోతున్నారు. బిసిలలో అనేక రకాల వృత్తుల వాళ్ళు ఉన్నారు. వ్యవసాయ ఉత్పత్తి కులాలు, సేవా కులాలు, వృత్తి కులాలు, సంచార కులాలు, అర్ధసంచార కులాలు, ఆశ్రిత కులాలు ఉన్నాయి. వీరందరినీ ఏక తాటిపైకి తేవడం కష్టము కావచ్చు, కానీ అసాధ్యమేమీ కాదు. కొన్ని ఉమ్మడి అంశాలపై ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు సెన్సెస్ లో కులగణనకు, రిజర్వేషన్ల పెంపుకు, సబ్ ప్లాన్ అమలుకు, ఎన్నికలలో రాజకీయ అధికారం చేపట్టడానికి బిసిలు ఏకత్వం సాధించాలి. ఈ రోజు బిసిలు పార్టీల వారీగా చీలిపోయి ఉన్న కారణంగా తాము ఐక్యంగా ఉంటే రాజకీయ అధికారాన్ని సొంతం చేసుకోవచ్చు అనే విషయమును గ్రహించలేక పోతున్నారు. ఇప్పటికైనా కుల వాదమును పక్కనపెట్టి బిసి వాదం, బిసి నినాదంతో ముందుకు వెళ్దాం. బీహార్ లొ లవ కుశ నినాదంతో కుర్మి మరియు కోయేరి కులాల కలయికతో నితీష్ కుమార్అధికారం లోకి వచ్చారు. గతములో గుజరాత్ KHAM (కోలి,హరిజన,ఆదివాసీ,ముస్లిం)ఉత్తర ప్రదేశ్ లో యాదవ,ముస్లిం పొత్తు అలాగే మాయావతి దళిత్,బ్రాహ్మణ్,ముస్లిం మొదలగునవి ఇలాంటి ప్రయోగాలు జరిగి విజయ వంతమయ్యాయి. ఇక్కడ తెలంగాణలో కూడా కేవలం ఒక ఐదు
మెజారిటీ కులాలు కలిస్తే తెలంగాణ రాష్ట్రంలొ రాజకీయ సునామి సృష్టించ వచ్చు. అధికారం అంది పుచ్చు కోవచ్చు.


3. బిసి వాదం వ్యాప్తి చేయాలి: ఈ స్వతంత్ర భారతంలో అత్యంత దగాపడ్డ, విపక్షతకు గురైన జాతి ఏదైనా ఉందంటే అది బిసి బిడ్డలు మాత్రమే. అన్ని రంగాలలో అణగద్రొక్కబడి, నేడు రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇతర ప్రభుత్వ ఉచితల పై (ప్రభుత్వాలు విదిలించే ఎంగిలి మెతుకులపై) ఆధారపడి జీవించాల్సిన దుస్థితి ఏర్పడింది. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు లేక చదువుకున్న పిల్లలు కూలీనాలి (gig workers) ప్రైవేటు వాహనాల డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఇళ్లలో పనిచేసే పని మనుషులుగా బ్రతికే దుస్థితి వచ్చింది. మన ఉద్యోగాలు అగ్రవర్ణాలు తన్నుకు పోతున్న కానీ మనకు సోయి లేదు. ఇప్పుడు బిసిలు మనుగడ కోసం పోరాటం చేయాల్సిన దయనీయ పరిస్థితి ఉత్పన్నమైనది.

కేవలం హైదరాబాద్, ఇతర కొన్ని పట్టణ ప్రాంతాలలో పనిచేస్తున్న బిసి సంఘాలు పల్లెబాట పట్టాలి. జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపుతు బిసి వాదమును గడపగడపకు తీసుకెళ్లి బిసి ప్రజలలో చైతన్యం తీసుకురావాలి. రాజకీయ అధికార కాంక్షను రగిల్చి రాజ్యం వీర భోజ్యం అని వివరించాలి. ప్రజలను సంఘటితపరచి సమస్యపై ప్రజాస్వామ్యయుత పోరాటానికి సమాయత్త పరచాలి. అప్పుడే బిసిల రాజ్యాధికారకాంక్ష నెర వేర్చడానికి మార్గం సుగమం అవుతుంది.

4. బిసిలు - రాజకీయ పార్టీలు: ఇప్పుడున్న ప్రతి జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీ బిసిలను ఓటు బ్యాంకుగా వాడుకొని వదిలివేసినవే. బిసిలు అంటే అగ్రవర్ణ ఆదిపత్యంలోని రాజకీయ పార్టీల దృష్టిలో కేవలం డబ్బులకు, మద్యంకు అమ్ముడుపోయే మనషులు. రాజకీయ పార్టీలలోని బిసి నాయకులు ఎన్నికల అప్పుడు తాము బిసిలమని చెప్పుకొని, గెలిచిన తర్వాత కొందరు ఆ విషయమును మర్చిపోయి బిసిల సమస్యల పరిష్కారానికి పాటుపడకుండా అగ్రకులాల చేతిలో ఉన్న రాజకీయ పార్టీ ఆధిపత్య నాయకులకు ఊడిగం చేస్తున్నారు. మరికొందరు బిసిల కొరకు చేయాలని ఉన్న బిసి వాదం బలంగా లేదనే ఉద్దేశంతో తమ ఆత్మ సాక్షిని చంపుకొని వారిని మోసం చేసుకుంటున్నారు. రాజకీయపార్టీ లైన్ దాటి మాట్లాడడానికి జంకుతున్నారు. ఓటర్లు కూడా మన బిసి నాయకులకు ఓట్లు వేసిన ప్రయోజనం ఏమి లేదు. చివరకు వారు కూడా అగ్రవర్ణాల సేవకులే కదా అని అగ్రవర్ణాలకే ఓటు వేసి బిసి నాయకులను ఓడించే పరిస్థితికి వచ్చారు. రాజకీయ పార్టీలు కూడా గెలుపు గుర్రాలు కావాలి అనే భావనతో, బిసిలకు సీట్లు ఇచ్చిన వారు గెలవరు అని చెబుతూ ధన బలం, కండ బలం ఉన్న అగ్ర కులస్తులకు సీట్లు ఇచ్చుకుంటున్నారు, ప్రజలను అనేక ప్రలోభాలకు గురిచేసి గెలిపించుకుంటున్నారు. ఇలాంటి విషవలయన్ని అర్ధం చేసుకోలేక ఇప్పుడు బిసిలు గందరగోల అయోమయ పరిస్థితులలో ఉన్నారు. ఎవరికి ఓటు వేయాలనే విషయాన్ని తేల్చుకోలేక పోతున్నారు

. ఈ సమస్యకు పరిష్కారమేమిటి?

5. దీనికి పరిష్కారము: బిసిలు మొదట సంఘటితం కావాలి, బిసి భావజాల వ్యాప్తి ఒక సునామి ల జరగాలి, కొత్తతరం ముఖ్యంగా బిసి యువత రాజకీయాలలోకి రావాలి. సమస్యలపై సంఘటితంగా ఉద్యమించాలి. ఉద్యమాలు బిసిలకు కొత్త ఏమీ కాదు అనే విషయమును గుర్తుపెట్టుకోవాలి. బీసీల ఓటు మన బిసి నాయకులకే అనే విషయాన్ని స్పష్టం చేయాలి. వారికే ఓటు వేయాలి. బిసి నాయకులలో చాలామందికి తమ బిసిల పక్షాన మాట్లాడాలని ఉన్న, వారు తమ మనసు చంపుకొని అగ్రవర్ణ రాజకీయ పార్టీలలో పనిచేస్తున్న వాళ్లు ఉన్నారు. మన బిసి నాయకులను అగ్రకుల మీడియాలు లక్ష్యంగా పెట్టుకొని వారిని తీవ్రంగా అగౌరవ పరుస్తున్నారు. వారి ప్రతిష్ట మంట కలుపు తున్నారు. ఎంతైనా మనవాడు మనవాడే ఎట్టి పరిస్థితుల్లోబిసిలు బిసిలకే ఓటు వేసేలాగా ఒట్టేసి పనిచేయాలి. ఏ రాజకీయ పార్టీ అయినా బిసిలకు అన్యాయం చేస్తే ఆ పార్టీలను ఎన్నికలలో సమాధి చేయాలి. ఇక చివరగా బిసిల రాజకీయ పార్టీ తప్పకుండా ఆవిర్భవించాల్సిన అవసరము ఉంది. బిసి వాదం గట్టిగా లేకుండా రాజకీయ పార్టీ పెట్టిన ఆ పార్టీ మనుగడ సాధించలేదు. బిసి ప్రజల ఆమోదం పొందదు. అందుకే గతంలో కొందరు రాజకీయ పార్టీలు పెట్టి భంగపడ్డారు. ఇప్పుడు తెలంగాణలో ఉద్యమ శూన్యత ఉంది. గత 80 సంవత్సరాల చరిత్ర చూసినట్లయితే ప్రతి 10, 15 సంవత్సరములకు ఒకసారి ఏదో ఒక ఉద్యమము పెద్ద ఎత్తున తెలంగాణలో ముందుకు దూసుకు వస్తుంది. 1940వ దశకంలో నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటము. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో 1960 దశకంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తొలి దశ ఉద్యమము, 1980 దశకంలో తెలుగు ఆత్మగౌరవ భావంతో ప్రాంతీయ పార్టీ ఆవిర్భావం, 1990లో భూస్వామ్య ఫ్యూడల్ వ్యవస్థలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ఉద్యమము, 2000 దశకంలో తెలంగాణ మలిదశ ఉద్యమాలు. ఇప్పుడు మిగిలిపోయిన ఉద్యమము బిసి ఉద్యమమే. అందుకే బిసిలు సంఘటితమై తమ రాజ్యాధికారం కొరకు పోరాడాలి. బిసిల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ రావాల్సిందే. ద్రవిడ ఉద్యమాన్నీ ముందుకు తీసుకుపోవటానికీ తమిళనాడులో డిఎంకె పార్టీలు వచ్చాయి. అలాగే లోహియా సోషలిస్టు సిద్ధాంతాలను ముందుకు తీసుకు వెళ్లడానికి బీహార్, ఉత్తరప్రదేశ్ లలో ఆర్జెడి, లోక్ దళ్ మరియు సమాజ్ వాది పార్టీలు ఏర్పడి అధికారంను కైవసం చేసుకున్నాయి. ఇక్కడ తెలంగాణలో ఒక చాకలి ఐలమ్మ, పండుగ సాయన్న, సర్వాయి పాపన్న స్ఫూర్తిగా బిసిల పార్టీ రావాల్సి ఉంది. బిసి వాదం బలపడితే బిసి రాజకీయ పార్టీ కచ్చితంగా వస్తుంది. ఒక నిస్వార్థ, నిజాయితిగల యువ నాయకుడు జనాలను ఆకర్షించే కరిష్మా ఉన్న వ్యక్తి రావాలి. ప్రజలను తన చుట్టూ ర్యాలీ చేయించుకోవాలి. ఒక సమర్థ, చురుకైన నాయకత్వం నేడు అవసరముంది. ఉద్యమము విస్తృతమైతే ఆటోమేటిక్ గా ఆవిర్భవిస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో జరగబోయే పంచాయతి ఎన్నికల్లో బిసిలు పాగా వెయ్యాలి. ఎంఎల్సీ ఎన్నికలలో బీసీ అభ్యర్థులను గెలిపించు కోవాలి.


భారత రాజముద్రలో నాలుగు సింహాలు ఉంటాయి. అవి ఓసి, బిసి, ఎస్సి, ఎస్టీ సింహాలు. ఇప్పుడు రాజ్యాధికారంలో ఓసీలు సెంటర్ గా, అటు ఇటు ఎస్సీ, ఎస్టీల సింహాలు కనిపిస్తున్నాయి. బిసి సింహము వెనుకకు నెట్టివేయబడినది. ఇప్పుడు రాజ్యాధికారము కొరకు అడ్డంకులను ఛేదించుకోని ముందు వరుసలోకి రావాల్సి ఉంది. ముందు వరసలో సెంటర్లో ఉన్న అల్పసంఖ్యాక ఆధిపత్య వర్గాన్ని వెనక్కి పంపాల్సి ఉంది. ఈ కనిపించని నాలుగో సింహం బిసి నిద్రలేచి విజృంభించాల్సిన అవసరం ఉంది.


ఇప్పుడు తెలంగాణలో బిసి వాదం చాప కింద నీరుల విస్తరిస్తుంది. ఇలాగే కొనసాగితే రాబోయే కొద్ది రోజులలో బిసి రాజ్యాధికారం వస్తుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనిపిస్తుంది

 జై బిసి..! జై పూలే..!!



Comments

Popular posts from this blog

Unveiling the "Real Majority" of India

Unveiling the "Real Majority": Divya Dwivedi’s Critique of the Hindu Majority Narrative * In contemporary Indian discourse, the notion of a "Hindu majority" is often taken as an unassailable fact, with official statistics frequently citing approximately 80% of India’s population as Hindu. This framing shapes political campaigns, cultural narratives, and even national identity. However, philosopher and professor at IIT Delhi, Divya Dwivedi, challenges this narrative in her provocative and incisive work, arguing that the "Hindu majority" is a constructed myth that obscures the true social composition of India. For Dwivedi, the "real majority" comprises the lower-caste communities—historically marginalized and oppressed under the caste system—who form the numerical and social backbone of the nation. Her critique, developed in collaboration with philosopher Shaj Mohan, offers a radical rethinking of Indian society, exposing the mechanisms of power t...

Mallanna Unleashes TRP: A New Dawn for Marginalized Voices in Telangana's Power Game

On September 17, 2025, Chintapandu Naveen Kumar, popularly known as Teenmar Mallanna—a prominent Telugu journalist, YouTuber, and former Congress MLC—launched the Telangana Rajyadhikara Party (TRP) in Hyderabad at the Taj Krishna Hotel. The event, attended by Backward Classes (BC) intellectuals, former bureaucrats, and community leaders, marked a significant moment for marginalized groups in Telangana. Mallanna, suspended from Congress in March 2025 for anti-party activities (including criticizing and burning the state's caste survey report), positioned TRP as a dedicated platform for BCs, Scheduled Castes (SCs), Scheduled Tribes (STs), minorities, and the economically weaker sections. The party's vision emphasizes "Samajika Telangana" (a socially just Telangana) free from fear, hunger, corruption, and prejudice, with a focus on inclusive development and responsible governance. Key highlights from the launch: Symbolism : The date coincided with Periyar Jayanti and V...

జనగణనలో కుల గణన: పారదర్శకత ఎలా?

T.Chiranjeevulu, IAS Ret కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 30న జనగణనలో కుల గణన చేపట్టాలని తీసుకున్న నిర్ణయం భారతదేశంలో సామాజిక న్యాయం కోసం ఒక చారిత్రక అడుగు. ఇది ఓబీసీల చిరకాల డిమాండ్‌ను నెరవేర్చడమే కాక, వెనుకబడిన కులాలకు న్యాయం అందించే దిశగా కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుంది. అయితే, ఈ కుల గణన పారదర్శకంగా, విశ్వసనీయంగా జరగాలంటే కొన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ వ్యాసంలో పారదర్శకత, విశ్వసనీయత కోసం అవసరమైన సూచనలను చర్చిస్తాం. కుల గణన యొక్క ప్రాముఖ్యత భారతదేశంలో కులం ఒక సామాజిక వాస్తవికత. ఇది వివక్ష, అణచివేతలకు కారణమవుతుంది. కుల గణన ద్వారా సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని గుర్తించి, సమస్యలకు పరిష్కారాలు చూపే అవకాశం ఉంది. ఇది ఓబీసీ రిజర్వేషన్ల సమీక్ష, ఉప-వర్గీకరణ, మానవ అభివృద్ధి సూచికల మెరుగుదలకు దోహదపడుతుంది. పారదర్శకత కోసం సూచనలు కుల గణన విజయవంతంగా, నమ్మకంగా జరగాలంటే కింది సూచనలు పాటించాలి: సెన్సస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహణ కుల గణన సెన్సస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో జరగాలి, ఎందుకంటే ఈ విభాగంలో శిక్షణ పొందిన అధికారులు, అనుభవం, పర్యవేక్షణ నైపుణ్యం ఉంటాయి. గతంలో (2011) గ్రామీణ, ...